ఎర్రగడ్డ, జూలై 16: జూబ్లీహిల్స్(Jubilee Hills )ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(MLA Maganti )ఆధ్వర్యంలో మంగళవారం బోరబండలో నిర్వహించిన ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సైట్-3 ప్రాఫెసర్ జయశంకర్ కమ్యూనిటీహాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి డివిజన్ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు మాగంటి సమక్షంలో వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అందిన అన్ని ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించటానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే మాగంటి సూచించారు.
పదేండ్ల క్రితం బోరబండ డివిజన్లోని చాలా బస్తీలు కనీస వసతులకు నోచుకోని పరిస్థితి ఉండేదని.. వీకర్‌సెక్షన్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేదని గుర్తు చేశారు. గత పదేండ్లలో సకల సదుపాయలను కల్పించటమే కాకుండా దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించామని తెలిపారు. దీంతో కాలనీలకు ధీటుగా బోరబండ బస్తీల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. బంగారు బండగా మారిన బోరబండకు చెందిన ప్రజలు ఈ మార్పును ఎన్నటికీ మరువలేరని అన్నారు. సమస్యల రహిత నియోజకవర్గంగా జూబ్లీహిల్స్‌ను తీర్చిదిద్దటానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.