కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 20 : కేపీహెచ్‌బీ కాలనీలో(KPHB Colony) గుడి, బడి భూములను అమ్ముకునే పనులను కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని, హౌసింగ్ బోర్డు లేఆవుట్ ప్రకారం కమ్యూనిటీ అవసరాల కోసం వదలిన 10 శాతం స్థలాలను ప్రజలకు చూపించాలి. ప్రజల ఆస్తులను అమ్ముతే ఊరుకునేది లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram )హెచ్చరించారు. సోమవారం కేపీహెచ్‌బీ కాలనీలోని గోవర్ధనగిరి కొండపై హౌసింగ్‌బోర్డు అధికారులు సీజ్ చేసిన వేణుగోపాల స్వామి కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాస్‌రావులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కేపీహెచ్‌బీ కాలనీలో 30 ఏండ్ల క్రితం నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపాన్ని హౌసింగ్ బోర్డు అధికారులు అకస్మాత్తుగా సీజ్ చేయడం బాధకరమన్నారు. ఆలయ కమిటీ సభ్యులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సమాచారం కూడా లేకుండా, పంచనామా నిర్వహించకుండా కళ్యాణ మండపాన్ని సీజ్ చేశారని, దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో ప్రభుత్వ పాఠశాల కోసం కేటాయించిన స్థలంలో బోర్డులు ఎందుకు పాతారో అర్థం కావడం లేదన్నారు.
కాలనీ 5వ ఫేజ్ సమీపంలో చర్చీ కోసం కేటాయించిన స్థలంలో కూడా హౌసింగ్ బోర్డు అధికారులు బోర్డులు పాతారన్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో గుడి, బడి, చర్చీలు, ఇతర కమ్యూనిటీ అవసరాల కోసం వదలిన ఖాళీ స్థలాలను అమ్ముకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24న జరిగే వేలంపాటను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, కోఆర్డినేటర్ సతీష్ ఆరోరా, డివిజన్ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి, సాయిబాబా చౌదరి, శ్యామలరాజు, రాజేష్, పీఎల్ ప్రసాద్, సాయి, ఆయా కాలనీల బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.