బేగంపేట్ జూలై 11: బోనాల ఉత్సవాలు మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బేగంపేట డివిజన్లోని అమ్మవారి ఆలయాలకు బోనాల జాతర కోసం మంజూరైన చెక్కులను శుక్రవారం ఆయన అందజేశారు. ప్రకాష్ నగర్‌లోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో 22 దేవాలయాలకు గాను మొత్తం రూ.6,06,000 మంజూరు కాగా చెక్కులను ఆయా దేవాలయాల కమిటీ సభ్యులకు ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల ఉత్సవ వైభవాన్ని ప్రపంచ దేశాల్లో చాటిచెప్పిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మన సంస్కృతీ వైభవాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అమ్మవారి ఆలయాలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ ఆర్థిక సహాయ చెక్కుల పంపిణీని ప్రారంభించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి, సురేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.