కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 8 : బీసీ కులగణన(BC Census) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తే సహించేది లేదని, బీసీ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాదారం కృష్ణారావు(MLA Madhavaram) డిమాండ్ చేశారు. శుక్రవారం కూకట్పల్లిలోని తన నివాసం వద్ద జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కానీ, సర్వేపై ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా, అసెంబ్లీలో చర్చిం చకుండా.. సొంత నిర్ణయంతో సర్వేను చేయడం సరైన పద్ధతి కాదన్నారు. నియోజకవర్గంలో చేస్తున్న కులగణనపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నామన్నారు.
సర్వేలో అడిగే ప్రశ్నలకు సంబంధించి ప్రజలకు పలు అనుమానాలు ఉన్నాయని, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించి నివృత్తి చేయాలన్నారు. బీసీ కులగణన పేరుతో చేస్తున్న సర్వేలో కుటుంబాలకు చెందిన ఆస్తులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇంట్లోని వస్తువుల వివరాలు ఎందుకోసం సేకరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న సర్వేతో బీసీలకు అన్యాయం జరిగితే..వారికి అండగా నిలబడి బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు.