కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 5 : కేపీహెచ్‌బీ కాలనీ, సీబీసీఐడీ కాలనీలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అధికారులను ఆదేశించారు. గురువారం కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని సీబీసీఐడీ కాలనీ(CBCID colony), కాలనీ 3వ ఫేజ్‌లోని బస్తీదవాఖాన, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాస్‌రావులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీబీసీఐడీ కాలనీలో అధిక సామర్థ్యం ఫైప్‌లైన్ వేసిన తర్వాత ఆ ఫైప్లైన్లకు పాత నల్లా కనెక్షన్‌కు అనుసందానం చేయలేదని, తద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఈ సమస్యను పరిష్కరించేలా జలమండలి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లోని బస్తీ దవాఖానాలో పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని, డాక్టర్లు అందుబాటులో ఉండి..వారికి సరిపడ మందులు అందించాలన్నారు. బస్తీ దవాఖానాలో మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతో పాటు చుట్టూరా ప్రహారి గోడను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.
అలాగే పట్టణ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో సరైన వసతులు లేకపోవడం వల్ల వైద్యులు, కాలనీ ప్రజలు ఇబ్బందులు పడాల్సివస్తుందని, ఈ సమస్య పరిష్కారం కావాలంటే… పాత భవనాన్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మించాలన్నారు. కాలనీలో పేద ప్రజల కోసం ఆరోగ్య కేంద్రం భవనాన్ని నిర్మించేలా కృషి చేస్తానన్నారు.