కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 26: కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే నిధులను కేటాయించాలని అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వినతిపత్రం అందించారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి పైప్ లైన్లు, పార్కులు, శ్మశాన వాటికల నిర్మాణం కోసం సుమారు రూ. 30 కోట్ల నిధులను సత్వరమే మంజూరు చేయాలని కోరారు.
అలాగే కూకట్పల్లి మండలం హైదర్‌నగర్ గ్రామంలోనీ సర్వే నంబర్.145, 163లలో నిర్మాణ అనుమతులు నిలిపివేశారని, గతంలో అన్ని ప్రభుత్వాలు ఈ కాలనీలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాయని, ఇటీవల కాలంలో అకస్మాతుగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలేదన్నారు. కాలనీలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
జేఎన్టీయూహెచ్ వెనకాల ఉన్న సాయి నగర్ కాలనీలో ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరించే విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలని, 2014 కు ముందు ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు డబ్బులు చెల్లించేందుకు కాలనీవాసులు సిద్ధంగా ఉన్నారని, వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. వినతి పత్రాలను సంబంధిత అధికారులకు పంపించి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.