బాలానగర్, ఆగస్టు 20 : ప్రజల వద్ద డబ్బులు గుంజాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ 22ఏను తెరమీదకు తీసుకొచ్చిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. గురువారం కూకట్పల్లి శేషాద్రినగర్‌లోని తన కార్యాలయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఎకరాల భూమిని కాజేయాలనే భారీ కుట్ర చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంతా జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పట్టా భూమిని సైతం 22ఏలో చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 22ఏ విషయమై 8నెలల కిందటే కైత్లాపూర్‌లో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఆవిష్కరణ కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకుపోయినట్లు చెప్పారు.
కానీ ఇప్పుడు ప్రభుత్వానికి ఏం తెలువదు.. అంతా అధికారుల పనే అని క్షమాపణ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ముడుపులు చెల్లించిన వారిని 22ఏ జాబితా నుంచి తొలగించే పనులకు ప్రభుత్వం పెద్దలు శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదన్నారు. కేపీహెచ్‌బీకాలనీ పరిధిలోని వసంతనగర్, సర్దార్‌పటేల్‌నగర్, సీబీసీఐడీకాలనీ, సాయినగర్, ఆల్విన్‌కాలనీ, తులసీనగర్లు 50 ఏండ్ల నుంచి పట్టా భూము ల్లో ప్రజలు నివాసం ఉంటున్నారని, వీటిని కూడా 22ఏ జాబితాలో ఎందుకు చేర్చారోసమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంలో ఆంతర్యమేమింటని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ భూములు కూడా 22ఏలో ఉందన్నారు. ఆయనకు ఒక న్యాయం ఇతరులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. గాజుల రామారంలోని 307 సర్వేనంబర్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందిన భూమిని 22ఏ జాబితాలో నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, జూపల్లి సత్యనారాయణ, మాధవరం రంగారావు, సీనియర్ నాయకులు తులసీరావు తదితరులు పాల్గొన్నారు.