అమీర్‌పేట్, నవంబర్ 4: జూబ్లీహిల్స్ ఓటర్లు కొట్టే దెబ్బకు, రాష్ట్ర సర్కార్, కాంగ్రెస్ అగ్రనేతల కళ్లు నెత్తిమీద నుంచి నేలమీదకు వస్తాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని మూటగట్టుకుందని అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తామే నెరవేరుస్తామన్నారు. ఎర్రగడ్డ డివిజన్లో జరిగే కేటీఆర్ రోడ్‌షోకు సంబంధించి మంగళవారం ఉదయం ఏజీకాలనీ రోడ్డులో ఏర్పాట్లను మాధవరం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల బతుకుల మీదికి బుల్డోజర్ను గురిపెడుతున్న రేవంత్ సర్కార్‌ను పేదలు ఏనాటికీ క్షమించరన్నారు. సీఎం హోదాలో ఉండి ఉప ఎన్నిక ప్రచారానికి ఇన్నిసార్లు వచ్చారంటేనే కాంగ్రెస్ ఓటమిని అంగీకరించినట్టు స్పష్టమవుతున్నదన్నారు. ఆగమేఘాల మీద కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని ఓ వ్యక్తిని.. మంత్రిని చేయడం వెనుక మతలబును ప్రజలు గమనించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఓటర్లను మాధవరం కోరారు.