కేపీహెచ్బీ కాలనీ, జనవరి 21 : డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జలమండలి అధికారులతో ఎమ్మెల్యే కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు భారీ రిజర్వాయర్లను నిర్మించి, కాలనీలు, బస్తీలో ఫైప్లైన్ పనులను చేపట్టామన్నారు. ఈ పనులతో దాదాపుగా తాగునీటి సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు.
నియోజకవర్గంలో చేపట్టిన పనులలో అక్కడక్కడ ఫైప్లైన్ పనులు, జంక్షన్ల అభివృద్ధి పనులు, డ్రైనేజీ ఫైప్లైన్ పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఆసంపూర్తి పనులతో కలుషిత తాగునీటి సరఫరా, లోప్రెషర్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆయా ప్రాంతాలలో పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాలనీలు, బస్తీలలో అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు ఎవైనా ఇబ్బందులు ఎదురైతే…వెంటనే ఆ సమస్యలను తన దృష్టికి తీసుకరావాలన్నారు.
ముఖ్యంగా ఆయా ప్రాంతాలలో పనులను చేస్తున్నప్పుడు జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న వేసవికాలంలో తాగునీటి ఇబ్బందులు తల్తేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకునేలా ప్రణాళికలు సిద్దం చేయాలని, కాలనీల వారిగా సమస్యలు గుర్తించి ముందస్తుగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.