కుత్బుల్లాపూర్, ఆగస్టు11: నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నాని అందులో భాగంగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే కేపీ వివేకాంద్ అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రజలు, పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యలపై వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
99వ రోజుకు ఎమ్మెల్యే ప్రగతి యాత్ర..
గాజులరామారం డివిజన్ దేవేందర్‌నగర్, నర్సంహా బస్తీ, పోచమ్మ బస్తీ, కట్టమైసమ్మ బస్తీ, హుస్సేన్ బస్తీ, అబీద్ బస్తీలలో శుక్రవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ నిర్వహించిన ప్రగతి యాత్ర 99వ రో జుకు చేరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తూ ఆయా బస్తీలలో పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో 99 రోజులు ప్రగతి యాత్ర పూర్తి చేసుకుని వంద రోజులకు అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ ప్రగతి యాత్ర కార్యక్రమం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి, జలమండలి జీఎం శ్రీధర్ రెడ్డి, ఎలక్ట్రీకల్ డీఈ రఘుపతి, జీహెచ్ఎంసీ డీఈఈ రూపాదేవి, జగద్గిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్, బీఆర్ఎస్ నాయకుడు అబీద్‌తో పాటు స్థానిక నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.