అంబర్‌పేట : బాగ్‌అంబర్‌పేట డివిజన్ కుర్మబస్తీ, పోచమ్మబస్తీల్లో నూతన సీసీ రోడ్ల(CC roads) నిర్మాణానికి సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kaleru Venkatesh) సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ముందుగా రోడ్డు ప్యాచ్‌వర్క్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. డివిజన్ కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డి, వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి సోమ వారం ఎమ్మెల్యే కుర్మబస్తీ, పోచమ్మబస్తీలో పాదయాత్ర నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయా బస్తీలలో వాటర్‌వర్క్స్ అధికారులు రోడ్డును తవ్వి పైప్‌లైన్ పనులు చేపట్టారు. ఆ రోడ్లకు ప్యాచ్‌వర్క్ చేపట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రాబోవు బోనాల పండుగకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, కొత్త ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అలాగే కలుషిత మంచినీరు లేకుండా స్వచ్ఛమైన మంచినీరు ప్రజలకు సరఫరా చేయాలని వాటర్‌వర్క్స్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు.