గోల్నాక, జూన్ 8: బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తీవ్ర భావోద్వేగాని లోనయ్యారు. ఆదివారం ఉదయం మాదాపూర్లోని నివాసంలో మాగంటి గోపినాధ్ భౌతికకాయం వద్ద ఆయన నివాళులు అర్పించారు. మాగంటి మృతితో తాను మంచి ఆప్త మిత్రుడిని కోల్పోయానని అన్నారు. తన సహచరుడు ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని చెప్పారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి ఎప్పటికీ మరవలేమని అన్నారు. మాగంటి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని ప్రసాదించాలని ప్రార్థించారు.