వనస్థలిపురం, ఫిబ్రవరి 4: అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్..పథకాలను అమలు చేయకుండా మోసం చేస్తున్నదని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం హస్తినాపురంలో జరిగిన ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గల్లీలో, ఢిల్లీలో ఎవరూ అధికారంలో ఉన్నా.. తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కలిసిగట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటుదామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలపైనే ఉందన్నారు. ఎక్కడ కార్యకర్తకు అన్యాయం జరిగినా, కేసులు పెట్టి వేధించినా అధైర్యపడొద్దని.. తాము అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ పాల్గొన్నారు.