MLA Sudhir Reddy | హయత్‌నగర్, అక్టోబర్ 2 : నియోజకవర్గంలోని మూసీ పరీవాహక ప్రాంత నివాసితులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఇండ్లను కూల్చాలంటే అధికారులు ముందుగా మమ్ములను దాటుకోని రావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి భరోసానిచ్చారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చైతన్యపురి, కొత్తపేట డివిజన్ల పరిధిలోని మూసీ పరీవాహక కాలనీవాసులైన భవానీనగర్, ద్వారకాపురం, గణేశ్పురి కాలనీ, ఇంద్రానగర్, ఫణిగిరి కాలనీ, మారుతీనగర్, వినాయకనగర్, సత్యనగర్, బృందావన్ కాలనీలవాసులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ మూసీ పరీవాహక ప్రాంతవాసులు ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు ఏ ఒక్క ఇంటిని కూడా ముట్టుకోనియమని, ఇక్కడ నివసించే కాలనీల ప్రజలు ఎవరూ భయభ్రాంతులకు గురికావద్దన్నారు. తాను ఉన్నంత వరకు ఎలాంటి హానీ జరగనీయనని, ఎల్లవేళలా మీకు తాను అందుబాటులో ఉంటానని హామీనిచ్చారు.
2020లో ఎంఆర్డీసీఎల్ చైర్మన్‌గా తాను ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించామని, మూసీ బెడ్లపై కొన్నివేల కోట్ల రూపాయలతో 32 ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేశామని వివరించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ 50 మీటర్ల బఫర్ జోన్ నిర్ణయిస్తే చాలా మంది ఇళ్లు కోల్పోతారని తెలుపగా దాని నిర్ణయం వెనక్కి తీసుకున్నారని తెలిపారు. మాజీ కార్పొరేటర్లు జిన్నారం విఠల్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, డివిజన్ల అధ్యక్షులు తోట మహేశ్ యాదవ్, లింగాల రాహుల్ గౌడ్, సొంటి చంద్రశేఖర్‌రెడ్డి, త్రివేది, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.