ఎల్బీనగర్/ చంపాపేట/మన్సూరాబాద్/హయత్ నగర్ నవంబర్ 9 : ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం ముఖ్య నాయకులతో కలిసి ఎల్బీనగర్ రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్న సుధీర్‌రెడ్డి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి పంకజకు అందజేశారు. నామినేషన్ దాఖలుకు ముందు తన నివాసంలో తల్లి చంద్రకళ వద్ద సతీసమేతంగా సుధీర్‌రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ షిర్డిసాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి చైతన్యపురి ఫణిగిరి కాలనీలోని శ్రీ కొసగుండ్ల లక్ష్మీ నర్సింహ స్వామి దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కర్మన్‌ఘాట్‌లోని శ్రీ కొసగుండ్ల లక్ష్మీ నర్సింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, సతీమణి కమలారెడ్డి పాల్గొన్నారు.