హిమాయత్‌నగర్, జనవరి 23 : పేదల ప్రజల జీవనాధారాన్ని ధ్వంసం చేస్తూ వారికి అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. గురువారం హైదర్శ్నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దానం నాగేందర్ మాట్లాడుతూ ఆపరేషన్ రోప్ పేరుతో ఫుట్‌పాత్‌లపై ఉన్న చిరు వ్యాపారస్తుల దుకాణాలను తొలగించడంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘అధికారులే సుప్రీం అనుకుంటే ఏట్లా..అలా చేస్తే ప్రభుత్వాలకు మనుగడ ఉండదు’ అని అన్నారు. ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేతలు మొదలు పెట్టాలంటే ముందుగా ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలంటూ.. వ్యాఖ్యలు చేశారు.
అధికారులు ఒక చోట పనిచేస్తూ బదిలీలతో మరోచోటుకు వెళ్తారని.. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజా ప్రతినిధులను ఆశ్రయిస్తారని తెలిపారు. ప్రభుత్వ పాలసీ ఉంటే ప్రజలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రజల్లో తాము తిరగలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పుట్టింది, పెరిగింది రాజకీయ జీవితాన్ని ఇచ్చింది హైదరాబాదేనని, ఖైరతాబాద్ నియోజకవర్గానికే పరిమితం తాను కాదని.. నగరంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా.. తాను ముందుటానని స్పష్టం చేశారు. పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న పేదవారిపై దౌర్జన్యం చేయడం ఏంటని మండిపడ్డారు.
మాదాపూర్‌లో పుట్‌పాత్‌పై కుమారి ఆంటీ పెట్టుకున్న క్యాంటీన్ విషయంలో ఇబ్బందిపెట్టినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి.. ఆమె జోలికి పోవద్దని అధికారులకు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారో ..పుట్ పాత్లపై చిరువ్యాపారం చేసుకునే పేదల దుకాణాల కూల్చివేతలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. చెరువులను కాపాడేందుకు హైడ్రా పనిచేస్తున్నదని, మూసీ ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాలని ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. పేద ప్రజల ఇండ్లు, షాపులు కూల్చివేయడం వల్ల నిత్యం ప్రజలు తన దగ్గరకు వస్తున్నారని, ప్రజల శాపనార్థాలు ప్రభుత్వానికి మంచిదికాదన్నారు.