సిటీ బ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): ప్రపంచ అందాల పోటీలు-2025 ప్రారంభోత్సవ కార్యక్రమం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం సాదాసీదాగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పోటీలు ప్రారంభమయ్యాయి. విభిన్న కళారుపాల ప్రదర్శనతో 72వ అందాల పోటీలు షురూ అయ్యాయి. ఈ పోటీల్లో పాల్గొనే 110 దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ తమ దేశ వేషాధరణతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ దేశీయ ఆహార్యంతోపాటు ఆయా దేశాల సంస్కృతి, సాంప్రదాయాలతో అలరించారు. ర్యాంప్ వాక్ చేసి సందడి చేశారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఏషియా దేశాల సుందరీమణులు నృత్యాలతో ఆకట్టుకున్నారు.తెలంగాణ రాష్ట్ర గేయం జయజయహే తెలంగాణ ఆలాపనతో ప్రారంభమైన కార్యక్రమం ఆద్యాంతం తెలంగాణ కళారూపాలతోనే సాగింది. 250 మంది కళాకారులతో కన్నుల పండువగా పేరిణి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. డప్పు, ఒగ్గు డోలు విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
ఆకట్టుకున్న నందిని గుప్తా..
మిస్ ఇండియా నందిని గుప్తా వచ్చినపుడు కరతాళ ధ్వనులతో స్టేడియం మార్మోగింది. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా అందరికి నమస్కరిస్తూ సాగిన ఆమె వాక్ ఆకట్టుకుంది. అనంతరం చీర కట్టుతో ర్యాంపు పైకి వచ్చిన మిస్ నేపాలి అందరినీ ఆకర్షించింది. కంటెస్టెంట్స్‌లో అందరికంటే చివరగా ర్యాంప్ పైకి వచ్చిన మిస్ వియత్నాం తనదైన డాన్స్‌తో అందరినీ అబ్బురపరిచింది. తమ జాతీయ జెండాలతో వేదికపైకి వచ్చిన కంటిస్టెంట్స్ ఉద్వేగానికి లోనయ్యారు. చివరగా మూడు రంగుల జెండాతో మిస్ ఇండియా నందిని గుప్తా వారికి సారథ్యం వహించిన ప్రక్రియ వీక్షకులను అబ్బురపరిచింది. జై భారత్ నినాదాలు మార్మోగాయి. ఈ ప్రారంభ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మిస్ వరల్డ్ సీఈఓ జూలియ మోర్లే, మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కో, తెలంగాణ సీఎస్ రామక్ృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఖాళీ కుర్చీలతో దర్శనం..!
ప్రపంచ వ్యాప్తంగా జరిపే వేడుకకు అధికారులు ఏర్పాట్లు తగిన విధంగా చేయలేదు. ప్రారంభోత్సవం ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. ఓ వైపు అధికారులు అందరికీ వీక్షించే అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ఇండోర్ స్టేడియం ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. ఎంతో గొప్పగా నిర్వహిస్తామని చెప్పిన సర్కార్ కనీసం తాగునీటి సదుపాయం కూడా కల్పించలేదని వీక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గెస్ట్‌లంతా మౌనమే..!
మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఉపన్యసించాల్సి ఉన్నా.. మాట్లాడకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచ ఈవెంట్ జరుగుతున్నప్పుడు కనీసం కంటెస్టెంట్స్‌కు శుభాకాంక్షలైనా చెప్పాల్సి ఉందని చర్చించుకుంటున్నారు. కేవలం పోటీలు ప్రారంభం అని చెప్పి ముగించారు. అనంతరం మాట్లాడాల్సిన మిస్ వరల్డ్ సీఈఓ జులియా సైతం మౌనంగానే ఉండిపోయారు. మంత్రి జూపల్లి కూడా మాట్లాడలేదు. దీంతో ప్రారంభోత్సవం సప్పగా సాగిందని వీక్షకులు చర్చించుకుంటున్నారు. అనంతరం కంటెస్టెంట్స్ అందరూ మిస్ వరల్డ్ గీతాలాపాన చేయడంతో ప్రారంభోత్సవం ముగిసింది. కాగా మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు ఈనెల 31న హైటెక్స్‌లో జరగనున్నాయి.