మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన భవన నిర్మాణంలో నిధులు గోల్మాల్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ శాశ్వత భవన నిర్మాణం కోసం మేడిపల్లి ప్రాంతంలో 56 ఎకరాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. సుమారు రూ. 75 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. బీఆర్ఎస్ హయాంలోనే 80 శాతం పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత భవన నిర్మాణ పనులు నత్తనడకన నడిచి..ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఇటీవల ప్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ శాశ్వత భవనం భూమి పూజ కార్యక్రమంలోనే వర్చువల్‌గా మల్కాజిగిరి కమిషనరేట్ భవనాన్ని కూడా సీఎం ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, భవన నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగినట్లు బయటపడింది. భవన నిర్మాణ సంస్థలోని సిబ్బందితో కుమ్మక్కైన అధికారులు అధిక బిల్లులు వేయించి ప్రభుత్వ ఖాజానాకు భారీగా గండి కొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఇటీవల కమిషనర్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆయన బదిలీ జరగడం వెనుక అదృశ్య శక్తులు పనిచేసినట్లు ఆరోపణలున్నాయి.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణంలో ఇంటిరియర్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఇతర సామగ్రి కొనుగోలు అక్రమాలు జరిగినట్లు తెలుస్తున్నది. మార్కెట్ ధర కంటే ఎక్కువగా బిల్లులు వేయించి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తెలిసింది. మార్కెట్ ధర కంటే దాదాపు ఐదు రెట్లు అధికంగా తప్పుడు బిల్లులు సృష్టించి, అసలు కార్యాలయం గడప తొక్కని వస్తువులను సైతం రికార్డుల్లో చెల్లింపులు చూపడం వంటి క్రియేటివిటీ చేసినట్లు అధికారులు గుర్తించారు.
కేవలం కాగితాల మీద జరిగిన ఈ ‘మాయా జాలం’తో ప్రభుత్వ ఖాజానా నుంచి సుమారు రూ. 6 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు గండిపడ్డట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్ చివరలో రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ను పునర్విభజన జరిగింది. రాచకొండ కమిషనరేట్ పేరును రద్దు చేసిన ప్రభుత్వం.. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి మొదటి పోలీస్ కమిషనర్‌గా అవినాశ్ మహంతిని నియమించింది. అవినాశ్ మహంతి బాధ్యతలు చేపట్టగానే కమిషనరేట్‌లో పేరుకుపోయిన పెండింగ్ ఫైల్స్, సిబ్బంది సమస్యలు, సిబ్బంది పనితీరు ఇలా ఒక్కో విభాగానికి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఇందులో భాగంగానే మేడిపల్లిలో నిర్మాణమవుతున్న నూతన భవన నిర్మాణ పనులను కూడా సమీక్షించినట్లు తెలిసింది. ఈ సమీక్షలో బిల్లులను పరిశీలిస్తున్న క్రమంలో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడటంతో ఈ విషయాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. భవన నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి..జరిగిన అవినీతిపై ఆరా తీసినట్లు తెలిసింది.
ఈ అవినీతి సొమ్ము కొందరి అకౌంట్లలోకి కూడా బదిలీ అయినట్లు గుర్తించినట్లు సమాచారం. ప్రజాధనాన్ని ఎలా కాజేస్తారు..? ప్రభుత్వ ఖాజనాకు గండికొడుతారా? కాజేసిన సొమ్మును వెంటనే రికవరీ చేయాల్సిందే.. లేదంటే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. కమిషనర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతోనే హడలిపోయిన సదరు అధికారి అవినీతి సొమ్మును తిరిగి చెల్లించేందుకు ఒప్పుకొన్నట్లు డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతున్నది. అయితే భవన నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలు వెలుగులోకి రావడంతో కారకులైన కొందరు అధికారులు తమ గాడ్ ఫాదర్స్ అయిన అదృశ్య శక్తులను కలిసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన కమిషనర్‌ను హఠాత్తుగా బదిలీ చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి.