హైదరాబాద్: హైదరాబాద్ చార్మినార్ సమీపంలో విషాదం చోటుచేసుకున్నది. చార్మినార్ సమీపంలోని మీర్‌చౌక్‌లోని (Mirchowk) గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాద ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించారు. ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు. ఉదయం 6.16 గంటలకు గుల్జార్ హౌస్ చౌరస్తాలోని జీ+2 భవనంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే మొఘల్‌పురా వాటర్ టెండర్ ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనంలో గ్రౌండ్ + 2 అంతస్తులు ఉన్నాయి. మొదటి అంతస్తులో మంటలు చెలరేగి.. పై అంతస్తుకు వ్యాపించాయి.
మొదటి అంతస్తులో చిక్కుకున్న 17 మందిని రక్షించి దవాఖానకు తరలించాం. మొత్తం 11 ఫైర్ వాహనాలు, ఒక ఫైర్ ఫైటింగ్ రోబోట్, 17 మంది అగ్నిమాపక అధికారులు.. 70 మంది సిబ్బంది ఆపరేషన్‌లో పాల్గొన్నారు. మంటలను ఆర్పడానికి మొత్తం 2 గంటల సమయం పట్టింది. అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించి చిక్కుకుపోయిన వారిని రక్షించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దెబ్బతిన్న ఆస్తి విలువ తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.
కాగా, షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. షార్ట్ సర్యూట్ వల్ల చెక్క మొత్తం కాలి మంటలు వ్యాపించాయని చెప్పారు. మొదటి అంతస్తులో ఉన్న 17 మందిని దవాఖానకు తరలించామని, నిచ్చెన ద్వారా నలుగురు పైనుంచి కిందికి వచ్చారని వెల్లడించారు. 17 మంది చనిపోయారని తెలిపారు. ప్రధాన ద్వారం వద్ద నిత్యం షార్ట్ సర్య్కూట్ జరుగుతున్నదని కార్మికులు చెప్పారన్నారు. అగ్ని ప్రమాద నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పారు.