హైదరాబాద్: వారంతా మైనర్లే.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యారు. అంతా కలిసి ఓ ఫామ్‌హౌస్‌లో (Farm House) విదేశీ మద్యం, గంజా కొడుతూ జోరుగా పార్టీ (Trap House Party) చేసుకున్నారు. అంతా మత్తులో ఉండగా ఎస్వోటీ పోలీసులు రంగప్రవేశం చేశారు. నిర్వాహకులతో సహా అందరనీ అదుపులోకి తీసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో చోటుచేసుకున్నది.
హైదరాబాద్‌కు చెందిన ఓ డీజే ఇన్‌స్టా యాప్‌లో ‘ట్రాప్ హౌస్.9ఎంఎం’ పేరుతో ఖాతా నిర్వహిస్తున్నాడు. మొయినాబాద్‌లోని చెర్రీ ఫామ్‌హౌస్‌లో ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నట్టు ప్రచారం చేశాడు. శనివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు పార్టీ జరుగుతుందని, పాల్గొనాలంటే ఎంట్రీ పాస్‌లు తీసుకోవాలని.. ఒక్కరికైతే రూ.1,600, అదే జంటగా వస్తే రూ.2,800 అని పేర్కొన్నాడు. ఇది చూసిన వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది మైనర్లు.. శనివారం మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు.
అయితే వేడుకలో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం అందడంతో రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. 6 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ పరీక్షలో ఇద్దరు మైనర్లు గంజాయి తీసుకున్నట్టు తేలింది. దీంతో ఆరుగురు నిర్వాహకులతోపాటు, మైనర్లను మొయినాబాద్ ఠాణాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.