పహాడీషరీఫ్, ఆగస్టు 22: బీఆర్ఎస్ పార్టీతోనే ఉజల భవిష్యత్ ఉంటుందని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని షాహీన్‌నగర్, ఉస్మాన్‌నగర్‌కు చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమంతో పాటు మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. మైనార్టీల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి.. వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. కాలనీలు, బస్తీలలో మునుపెన్నడూ లేని విధంగా వందలాది కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక వసతులు సమకూర్చుతున్నామన్నారు.
ఇంటింటికీ మంచి నీటి సరఫరా కోసం కోట్లాది రూపాయలు కేటాయించి రిజర్వాయర్లు ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. అనంతరం పార్టీలో చేరిన పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. మైనార్టీల కాలనీలు, బస్తీల్లో సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనునిత్యం ప్రజలతో ఉంటూ, సమస్యలు తెలుసుకుంటున్నారని తెలిపారు. కాలనీలు, బస్తీల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరామన్నారు. నియోజకవర్గం బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా కేసీఆర్ నియమించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇక్భాల్ బిన్ ఖలీఫా, నాయకులు అవినాశ్, మన్సూర్ అలీ తదితరులు పాల్గొన్నారు.