– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): : ఏదో ఓ నాయకుడిని ఒక రాజకీయ పార్టీ విస్మరించడం సాధారణంగా చూస్తాం. కానీ ఏకంగా ఒక వర్గాన్ని ఓ రాజకీయ పార్టీ దగా చేయడం అరుదుగా కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దరిమిలా రాజకీయ ముఖ చిత్రంపై తాజాగా ఇదే అందరిని విస్మయానికి గురి చేస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను ఉప పోరు టికెట్ రేసు నుంచి పొగబెట్టి పక్కకు తప్పించిన కాంగ్రెస్ ఇప్పుడు నియోజకవర్గంలో ఇతర మైనార్టీ నేతలకూ ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
కేవలం పార్టీలోనే కాదు.. గత ఐదారేండ్లుగా సామాజిక సేవ ద్వారా నిరుపేద ముస్లిం కుటుంబాలను ఆదుకుంటున్న హెచ్వైసీ వ్యవస్థాపకుడు సల్మాన్‌ఖాన్‌ను కూడా హస్తం పార్టీ ఢోకా చేసిందనే విమర్శలున్నాయి. దీంతో భారీ ఓటుబ్యాంకు ఉన్న మైనార్టీల్లో హస్తం పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇటీవల బిలియన్ కనెక్ట్ అనే సంస్థ మైనార్టీల్లో నిర్వహించిన సర్వే ఫలితాలు కూడా ఇది వాస్తవమేనని తేల్చింది. అందుకే సల్మాన్‌ఖాన్ బీఆర్ఎస్లో చేరగా.. కొన్నిరోజులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మైనార్టీ నేతలు పెద్ద ఎత్తున గులాబీ కండువా కప్పుకుంటున్నారు.
హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు అనేది కీలకం. గత మూడు పర్యాయాలు వీరంతా బీఆర్ఎస్కు మద్దతుగా నిలువడంతో మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు. మరి.. ముస్లిం మైనార్టీలు బీఆర్ఎస్ను ఆదరిస్తున్నారనే కక్షనో… ఇంకేదైనా కారణమోగానీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను మరింత దగా చేస్తుందనే ఆగ్రహం ఆ వర్గంలో తీవ్ర వ్యక్తమవుతున్నది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి, ఓడిపోయిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఆది నుంచి ఆ పార్టీనే నమ్ముకొని సేవ చేస్తున్నారు.
ఏఐసీసీ స్థాయిలో మంచి సంబంధాలున్న అజారుద్దీన్‌కు మైనార్టీ నేతగా మంచి గుర్తింపు కూడా ఉంది. ఈ క్రమంలో ఓడిపోయినప్పటికీ రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలోనే ఉంటూ అందరికీ అందుబాటులో ఉన్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక రావడంతో తాను కాంగ్రెస్‌ను నమ్ముకొని ఉన్నందున సాధారణంగా టికెట్ తనకే వస్తుందని అజార్‌తో పాటు మైనార్టీలు సైతం ఆశించారు. కానీ కేవలం అజార్‌ను రాజకీయంగా అణగదొక్కాలనే కసితోనే కొందరు పెద్దలు ఆయనకు టికెట్ రాకుండా చేశారనే ఆరోపణలు అజార్ వర్గం నుంచి వినిపిస్తున్నాయి. టికెట్ రేసు కొనసాగుతున్న సమయంలో అజారుద్దీన్ ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలను కలిసి వచ్చిన తర్వాతనే రాష్ట్ర కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడమే ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయని చెబుతున్నారు. గతంలో గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్‌కు అవకాశం ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ సుప్రీం కోర్టు వాళ్ల సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని ఆసరాగా చేసుకొని అమీర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్‌ను పేరును ప్రతిపాదించింది.
దీనికి ఏఐసీసీ కూడా ఆమోదం తెలిపి ప్రకటన చేసింది. వాస్తవానికి అజార్ కూడా ఆదిలో తనకు మంచి అవకాశం కల్పించారని అనుకున్నప్పటికీ న్యాయపరమైన చిక్కులతో అది అయ్యేది కాదు… పొయ్యేది కాదని పార్టీలోని అజార్ సన్నిహితులు, శ్రేయోభిలాషులు తేల్చి చెప్పారు. దీంతో జూబ్లీహిల్స్ టికెట్ రేసు నుంచి తనను తప్పించేందుకే సీఎం వర్గం ఈ అస్ర్తాన్ని ప్రయోగించిందని అజార్ గుర్తించి తిరిగి బరిలో నిలిచేందుకు మైనార్టీ పెద్దలు, నేతలతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ అప్పటికే సదరు వర్గం వేగంగా పావులు కదిపి ప్యారాచూట్ నేత నవీన్‌యాదవ్‌కు మార్గం సుగమం చేసిందని పలువురు కాంగ్రెస్ నేతలు తెలిపారు. దీంతో అప్పటి నుంచి అజార్ వర్గమే కాకుండా నియోజకవర్గంలోని మైనార్టీల్లోనూ కాంగ్రెస్ వైఖరిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి మొదలైంది. ఇదేగాకుండా ఉప ఎన్నిక ప్రచారం మొదలు ఇతర అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలకు ప్రాతినిథ్యం పెద్దగా కల్పించకపోవడం అసంతృప్తి కాస్తా ఆగ్రహంగా మారిందని అంటున్నారు.