హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల్లోని విద్యార్థుల ఆకలితీర్చే ‘సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం’ను శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంత్రులు హరీశ్ రావు, సబితాఇంద్రారెడ్డి ప్రారంభించి చిన్నారులకు ఇడ్లీలు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే పథకమని అన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని ఇండ్లల్లోని పిల్లలు ఏం తింటారో.. సీఎం బ్రేక్‌ఫాస్ట్‌లో అదే మెనూను చేర్చి, సర్కారు బడుల్లోని చిన్నారులకు అందజేస్తున్నామన్నారు. 1వ -10వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్‌ను సమకూర్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల కడుపునింపే కార్యక్రమం మాత్రమేకాదని, డ్రాప్ అవుట్ రేటును తగ్గించి, బడిబాట పట్టించి విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చే పథకమన్నారు.
దసరా తర్వాత ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని చెప్పారు. అనంతరం మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఉప్మా పెట్టవద్దన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పౌష్టికాహారంతో కూడిన మెనూను రూపొందించామన్నారు. పంచాయతీరాజ్, మహిళాశిశు సంక్షేమశాఖ, మున్సిపల్‌శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు గడ్డం రంజిత్‌రెడ్డి, బీబీపాటిల్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, రఘోత్తంరెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ హన్మంతరావు, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ యువ నేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.