Thummala Nageswara Rao | మాదాపూర్, ఫిబ్రవరి 7: వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రైతులను ప్రోత్సహించేందుకు కిసాన్ అగ్రి షో ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కిసాన్ అగ్రి షో 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. కిసాన్ ఫోరం ప్రైవేటు లిమిటెడ్ కన్వీనర్ నిరంజన్ దేశ్ పాండేతో కలిసి శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ .. రైతులు వ్యవసాయం రంగంలో నూతన విధివిధానాలతో, పంట సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేశించేందుకు కిసాన్ అగ్రి షో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. వ్యవసాయ రంగ ప్రముఖులు, నిపుణులు, మార్గదర్శకులు, రైతులందరినీ ఒకే చోటికి తీసుకురావడానికి కిసాన్ హైదరాబాద్ గొప్ప వేదిక అని తెలిపారు. వ్యవసాయ రంగంలో అత్యాధునిక పురోగతిపై సంభాషణ, సహకారం, పరిశోధనకు ప్రోత్సాహకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, పనిముట్లు, నీరు, నీటిపారుదల పరిష్కారాలు, ప్లాస్టికల్చర్, వివిధ సాధనాలు, వాటి పనిముట్లు, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు, స్టార్టర్లు, కాంట్రాక్ట్ వ్యవసాయ పరిష్కరాలు, వ్యవసాయ ఇన్పుట్లు, రక్షిత సాగు సాంకేతికలతో పాటు వ్యవసాయం కోసం మొబైల్ యాప్లు, కస్టమ్ క్లియరెన్స్ సేవలు వంటి విస్తృత శ్రేణి ఉత్పత్తులు వంటివి అందుబాటులో ఉన్నాయి.