అమీర్‌పేట్, ఆగస్టు 11: పౌర సమస్యలను పరిష్కరించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కార్ మాత్రమే పరిష్కారం చూపగలిగిందన్నారు. విపక్షాలు విమర్శలు మినహా మరొక పని లేకుండా పోయిందన్నారు. అమీర్‌పేట్ డివిజన్ ఎస్ఆర్టి కాలనీలో చేపడుతున్న డ్రైనేజీ పనులను సంబంధిత అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని కోరగా, అక్కడే ఉన్న జలమండలి జీఎం హరిశంకర్, డీజీఎం వంశీకృష్ణలను తక్షణమే తాగునీటి పైపులైన్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భూగర్భ పైపులైన్ల నిర్మాణ పనులు ముగిసిన తరువాత కాలనీలో పూరి స్థాయి వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల అవసరాలు గుర్తించి సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు హనుమంతరావు, నాయకులు అశోక్‌యాదవ్, కాలనీ నివాసితులు శ్రీనివాస్, విఠల్ నారాయణ, శివ, అశోక్, రాజు, శేఖర్, రాయల సేవా సమితి అధ్యక్షులు ఆర్.సి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వినాయక ఆలయ అభివృద్ధికి చర్యలు
అమీర్‌పేట్ గురుమూర్తి నగర్ వినాయక దేవాలయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలను ఈవో నరేందర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. దేవాలయ ఆవరణలోని ఖాళీ స్థలంలో షెడ్డు నిర్మాణంతో పాటు ఆలయ గర్భగుడి వెనుక గ్రౌండ్ ప్లస్ ఫోర్ పద్ధతిలో భవన నిర్మాణం జరిపేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని ఈవోను ఆదేశించారు. నూతనంగా నిర్మించే భవనంలో ఈవో కార్యాలయం, పాలక మండలి సభ్యుల కార్యాలయం, కిచెన్, అర్చకుల గది, టాయ్‌లెట్స్ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పంచాలనే ఉద్దేశంతో విస్తరణ పనులను చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, బీఆర్ఎస్ నాయకులు దాడి ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.