బేగంపేట్ నవంబర్ 5: దేశంలోనే అత్యంత సురక్షితమైన, శాంతి భద్రతలకు నిలయం హైదరాబాద్ నగరమని సనత్‌నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. రాంగోపాల్‌పేట్ డివిజన్లోని పీజీ రోడ్డులో ఉన్న ఆర్యవైశ్య భవన్లో ఫెడరేషన్ ఆఫ్ పీజీ రోడ్డు కాలనీస్ అపార్ట్మెంట్ సొసైటీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ..భాష, ప్రాంతం వేరైనా ఇక్కడ నివసించే వారంతా తమ వారేనన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతున్నదన్నారు. 50 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదిన్నరేండ్లలో చేసి చూపించామన్నారు. 2014కు ముందు పీజీ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ ఎంతో అధ్వానంగా ఉండేదని.. కానీ ఇప్పుడు అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు.
నగరంలోని గోశాలల్లో జీవాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య సేవలందించడంతో పాటు మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. గుజరాతీ,జైన్, ఆగర్వాల్, మహేశ్వరి సమాజ్, రాజస్థానీ తదితర సమాజ్లకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తలసాని సాయికిరణ్‌యాదవ్, జైన్ సమాజ్ అధ్యక్షుడు యోగేశ్జైన్, కార్పొరేటర్ మహేశ్వరి మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.