బేగంపేట్, మార్చి 4: పికెట్ నాలాపై వంతెన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి ఏప్రిల్ నెల చివరి వరకు పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం బేగంపేట మినిస్టర్ రోడ్‌లోని పికెట్ నాలాపై ఎస్ఎన్డీపీ కార్యక్రమం కింద చేపట్టిన వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏటా వర్షాకాలంలో నాలాకు ఎగువ నుంచి వచ్చే నీరు సక్రమంగా వెళ్లక పరిసర కాలనీలు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నగరంలో ఉన్న అనేక నాలాల పరిధిలో ఇలాంటి పరిస్థితులున్నాయని, వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ చొరవతో పూర్తి స్థాయిలో నాలాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించి.. సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా కరాచీ బేకరీ వద్ద కూడా పికెట్ నాలాపై రూ. 10 కోట్ల వ్యయంతో నూతనంగా వంతెనను నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు.
మినిస్టర్ రోడ్లో ఉన్న వంతెన కూడా శిథిలావస్థకు చేరడంతో నీటి సరఫరా సక్రమంగా జరగక ముంపు సమస్య ఏర్పడుతున్నదన్నారు. సమస్య పరిష్కారం కోసం పాత వంతెనను తొలగించి గతంలో ఉన్న దానికంటే ఎత్తులో వాహనాల రాకపోకలు సులువుగా సాగేలా వెడల్పుగా నిర్మిస్తున్నట్టు తెలిపారు. వంతెన నిర్మాణంతో అన్నానగర్ రసూల్‌పుర బస్తీ, ఇక్రిశాట్, బీహెచ్ఈఎల్ కాలనీ తదితర అనేక కాలనీలకు ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందన్నారు.
బేగంపేట నాలా పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. నాలా వెంట ఉన్న కాలనీల్లో డ్రైనేజీ, వాటర్ పైపులైన్ పనులు పూర్తయినట్లు, రోడ్డు నిర్మాణ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నో సంవత్సరాల కిందట నిర్మించిన నాలాల నిర్వహణ గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు కూడా వరద ముంపు సమస్యకు ఒక కారణంగా చెప్పారు. నాలాల వెంట ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్పొరేటర్ మహేశ్వరి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, జలమండలి డైరెక్టర్ కృష్ణ, ఈఈ సుదర్శన్, జలమండలి జీఎం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.