హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha rao) 102వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి (PV Gnana bhoomi) వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవితోపాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ పుష్పాంజలి ఘటించారు. పీవీ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఆర్ధిక సంస్కరణల జాతిపిత పీవీ నరసింహారావు అని అన్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి పీవీ అని, సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఆయన సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ తగినరీతిలో గౌరవిస్తుందని వెల్లడించారు. పీవీ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు పీవీ స్ఫూర్తిదాయకమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మార్గదర్శకంగా నిలిచారని చెప్పారు.