రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై అంబర్‌పేట చౌరస్తాలో చర్చకు సిద్ధమా ? అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సవాల్ విసిరారు. సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా దమ్మిడీ లేదని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డివి తాడూ బొంగురం లేని మాటలు అని విమర్శించారు. గోల్నాక డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధ్యక్షతన మహారాణా ఫంక్షన్హాల్లో జరిగింది. ఈ సమావేశానికి హైదరాబాద్ బీఆర్ఎస్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్‌కుమార్‌తో కలిసి మంత్రి తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ తెలంగాణను పార్టీ వ్యవస్థాపకుడు పులిజాల గెల్వయ్య బీఆర్ఎస్లో విలీనం చేశారు. ఇదిలా ఉంటే గ్రేటర్లో ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి.
తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీగార్డెన్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితారెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి ఎల్. రమణ పాల్గొనగా, బాలానగర్‌లోని తెలంగాణ గార్డెన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మేడ్చల్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఆజంపురాలోని ఆజం ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనానికి హోంమంత్రి మహమూద్ అలీ, పార్శిగుట్ట ఎస్ఎల్ఎన్ ఫంక్షన్హాల్లో ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, రామంతాపూర్ పద్మశాలీ భవన్‌లోని ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, నాంపల్లి విజయ్‌నగర్ కాలనీ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆత్మీయ అతిథులు సహపంక్తి భోజనాలు చేశారు.
గోల్నాక, ఏప్రిల్ 9: అభివృద్ధిపై అంబర్‌పేట చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. 15 ఏండ్లుగా అంబర్‌పేటకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి నియోజకవర్గానికి ఏమీ చేయక పోగా తాడు బొంగరం లేని మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆదివారం అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్యక్షతన అంబర్‌పేట మహారాణా ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇంఛార్జ్ దాసోజు శ్రవణ్‌కుమార్, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్ తదితరులతో కలసి ఆయన హాజరై మాట్లాడారు.
మొన్న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా దమ్మిడీ కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. అంబర్‌పేటలో కాలేరు వెంకటేశ్ ఓడించినందుకే కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారని, ఇంట్లో మోదీ ఫొటో పక్కకు కాలేరు వెంకటేశ్ ఫొటో పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నాయకులకు ఢిల్లీ నుంచి నిధులు తెచ్చే దమ్ముందా అంటూ ఆయన నిలదీశారు.
బీజేపీ మతాలు, కులాల పేరుతో రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నదని విమర్శించారు. తమకు బొట్టు పెట్టుకోవడం, దేవున్ని ఎలా మొక్కడం నేర్పిస్తామంటూ దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వాల హయాంలో ఇంట్లో ఒకరు పోతే మరకొరికి పింఛన్ ఇస్తామనే దీనస్థితి ఉండేదని కానీ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని తెలిపారు. దేశంలో సీఎం కేసీఆర్‌ను ఎవరూ ఢీ కొట్టే పరిస్థితి లేదన్నారు. పండుగ వాతావరణంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్ జిల్లాలోనే అతి పెద్ద సమ్మేళనమన్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు తాను ఎల్లప్పడూ అండగా ఉంటామన్నారు.
దాసోజు శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రశ్నాపత్రాల పేపరు లీకేజీ కేసులో ఉన్నోళ్లందరూ బీజేపీ వాళ్లే అని స్పష్టం చేశారు. అంబర్‌పేట నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించారని ప్రశంసించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ..తెలంగాణలో అమలవుతున్న అభివృది, సంక్షేమ కార్యక్రమాలను చూసి దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఈ సమ్మేళనంలో దాదాపు 5వేల మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లోకి కమ్యూనిస్టు రాష్ట్ర నేత గెల్వయ్య
బాగ్‌అంబర్‌పేటకు చెందిన సీనియర్ కమ్యూనిస్ట్ నేత పులిజాల గెల్వయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం అంబర్‌పేట మహారాణా ప్రతాప్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమక్షంలో కమ్యూనిస్ట్ ఆఫ్ తెలంగాణ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. గెల్వయ్యతో పాటు దాదాపు ఐదు వందల మంది కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలను మంత్రి తలసాని పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. ఎన్నో ఏండ్లుగా తన రాజకీయ ప్రస్తానంతో అందిరికీ కరుడుగట్టిన కమ్యూనిస్టు నేతగా సుపరిచితులైన పులిజాల గెల్వయ్య బీఆర్ఎస్ పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనకు ఇది నిదర్శనమన్నారు.
సీసీఎం, సీపీఐ పార్టీలలో రాష్ట్రస్థాయిలో ఎన్నో పదవులు చేపట్టిన గెల్వయ్య ప్రజా ఉద్యమాల్లో దాదాపు 35 సార్లు జైలుకు వెళ్లిన చరిత్ర ఉందన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అంబర్‌పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చేపడుతున్న అభివృద్ధిని చూసి తాను స్థాపించి కమ్యూనిస్ట్ ఆఫ్ తెలంగాణను బీఆర్ఎస్ లోకి విలీనం చేయడం తనకు గర్వంగా ఉందని గెల్వయ్య తెలిపారు. గెల్వయ్య బీఆర్ఎస్లో చేరికతో అంబర్‌పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరిస్తోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. అంతకు ముందు అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసిన గెల్వయ్య అక్కడి నుంచి రాణాప్రతాప్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.