మృగశిర కార్తెను పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం బత్తిని కుటుంబీకుల చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 80 వేల మందికి చేప మందును అందించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. చేప ప్రసాదం స్వీకరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారికి భోజనం, ఫలహారాలు, మంచి నీటిని సమకూర్చిన స్వచ్ఛంద సంస్థలను అభినందించారు.
సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ)/అబిడ్స్/సుల్తాన్‌బజార్/తెలుగుయూనివర్సిటీ : బత్తిని కుటుంబీకుల చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఇది రాత్రి వరకు కొనసాగగా.. మొత్తం 80 వేల మందికి పంపిణీ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కరోనా కారణంగా చేపల ప్రసాదం పంపిణీ ప్రక్రియ నిలిచిపోగా.. మూడేండ్ల తర్వాత తిరిగి చేపట్టిన చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు పెద్ద ఎత్తున ఉబ్బస వ్యాధిగ్రస్తులు తరలివచ్చారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 32 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. శనివారం దూద్‌బౌలిలో చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబీకులు ఏర్పాట్లు చేశారు.
సీఎం ఆదేశాల మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప ప్రసాద కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకున్నారు. మత్స్యశాఖ ఆరు లక్షల చేప పిల్లలను సిద్ధం చేసి ఉంచింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఉబ్బస వ్యాధిగ్రస్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖలు సమన్వయంతో వ్యవహరించి పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. పోలీసు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, మత్య్యశాఖ, ఆర్అండ్బీ, జలమండలి, ఆర్టీసీతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
చేప ప్రసాదం కోసం వచ్చిన వారికి తెలంగాణ హోటల్స్ అసోసియేషన్, హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40 వేల మందికి భోజన వసతి కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సద్ది వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ భోజనం అందేలా ఏర్పాట్లు చేశారు. అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి ఎం.రామ్మూర్తి, సుప్రభాత్ కృష్ణమూర్తి, చంద్రశేఖర్ రావు, యూసుఫ్, సంపత్ తదితరులు భోజన వసతికి తమ సహకారం అందించారు.
వచ్చిన ప్రతి ఒక్కరికీ చేప ప్రసాదాన్ని అందించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చేప ప్రసాదానికి పూజలు నిర్వహించిన అనంతరం పంపిణీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశంలోనే ఎంతో ప్రాముఖ్యతను కలిగిన చేప ప్రసాదం పంపిణీని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని అన్నారు. 178 సంవత్సరాల నుంచి వంశపారంపర్యంగా మృగశిర కార్తె సందర్భంగా అందిస్తున్న చేప ప్రసాదం అంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, చేప ప్రసాదం కోసం ప్రతిసారి దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఇక్కడకు వస్తారని పేర్కొన్నారు. హరినాథ్ ఆరోగ్యం సరిగాలేకున్నా అతడి కుటుంబ సభ్యులు రెండు రోజులపాటు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారని అన్నారు.
మృగశిర కార్తె సందర్భంగా చేపలను కొనుగోలు చేసేవారికి ఎటువంటి కొరత తలెత్తకుండా మత్స్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విక్రయ కేంద్రాల్లో చేపలను అందుబాటులో ఉంచామన్నారు. మృగశిర కార్తె రోజున చేపల వంటకాలు తినాలనే ప్రజల నమ్మకానికి అనుగుణంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారితో హైదరాబాద్‌లో 40 స్టాళ్లను, అన్ని జిల్లాల్లో 800 స్టాళ్లను ఏర్పాటు చేసి వివిధ రకాల వంటకాలను భోజన ప్రియులకు అందించామన్నారు. మంత్రి వెంట భారాసా గోషామహల్ నియోజకవర్గ ఇన్చార్జి నంద కిషోర్ వ్యాస్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్, సీనియర్ నాయకులు ఆర్వీ మహేందర్ కుమార్ తదితరులు ఉన్నారు.