Minister Srinivas Yadav | బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బల్కంపేట ఆలయ నూతన పాలకమండలి మంగళవారం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అంతకు ముందు ఆలయానికి వచ్చిన మంత్రి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ పరిసరాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం కమిటీ సభ్యులతో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక దేవాలయాలను అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. ప్రధానంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ప్రభుత్వ నిధులే కాకుండా దాతల సహకారంతో కూడా భక్తులకోసం అనేక సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. గతంలో అమ్మవారి కల్యాణాన్ని ఆలయం లోపల కొద్దిమంది భక్తుల మధ్య నిర్వహించేవారని అన్నారు. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయం ముందు పెద్ద రేకుల షెడ్డును నిర్మించి వేలాది మంది భక్తుల సమక్షంలో కల్యాణ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
ఈ సంవత్సరం జూన్ 20న తేదీన అమ్మవారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఆలయం చుట్టూ, ఆలయానికి వచ్చే అన్ని రహదారులను వాహనదారులు, భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అభివృద్ధి చేసినట్లు వివరించారు. అదేవిధంగా ఆలయం ముందు చిరువ్యాపారాలు చేసుకొంటున్న వారికోసం నూతనంగా షాప్‌లను నిర్మించడం జరిగిందని, వాటిని 4న ప్రారంభిస్తామని తెలిపారు. ఎలాంటి అద్దె లేకుండా కేటాయించడం జరుగుతుందని చెప్పారు. షాప్‌ల కేటాయింపులో ఎలాంటి విమర్శలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆలయానికి వచ్చే భక్తులను ఇబ్బందులకు గురిచేసినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినవారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. దేవాలయానికి సంబంధించి షాపులను తీసుకున్న వారు సకాలంలో అద్దె చెల్లించే విధంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. అవసరమైన అన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అధికారులు, నూతన పాలక మండలి సభ్యులు సమన్వయంతో వ్యవహరించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మిబాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈవో అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.