Minister Srinivas Yadav | తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే గొప్ప పండుగ బోనాల ఉత్సవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో చేపట్టిన అంబారిపై అమ్మవారి ఊరేగింపునకు చార్మినార్ వద్ద మంత్రి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ ఆలే భాస్కర్రాజ్ మంత్రికి త్రిశూలాన్ని అందజేశారు. ఉప్పుగూడలో తల్వార్ టిల్లు యాదవ్ ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించారని చెప్పారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించడం, తొట్టెల ఊరేగింపు, ఫలహారం బండ్ల ఊరేగింపుతో నగరంలోని పలు ప్రాంతాలలో సందడిగా మారుతుందని వివరించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసిందని చెప్పారు. ప్రజలు పండుగలను గొప్పగా, సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రికి టిల్లు యాదవ్ తల్వార్‌ను బహూకరించారు.