సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ పుట్టిన రోజుతో పాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సచివాలయ ప్రారంభోత్సవం.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ నెల 13న నియోజకవర్గాల్లో జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడంతో పాటు అదే రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభం, పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ జన సమీకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి, కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ చైర్మన్లతో పాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని మంత్రి చెప్పారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే సభ విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించినట్లు మంత్రి తలసాని తెలిపారు. సంబంధిత ఇన్చార్జీలు ఈ నెల 13వ తేదీ విస్తృతస్థాయి సమావేశాల నిర్వహణ మొదలుకొని.. 17న పరేడ్ గ్రౌండ్ సభ వరకు నియోజకవర్గ పరిధిలోనే ఉండాలన్నారు. అందరినీ సమన్వయం చేసుకొని సభ విజయవంతం చేయాలని కోరారు.