హైదరాబాద్ : హైదరాబాద్‌లో వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. నాలాల పూడికతీత పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రిటైనింగ్ వాల్స్ నిర్మాణం కూడా చేపట్టామని చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎవరు పట్టించుకోని నాలాల అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని మంత్రి స్పష్టం చేశారు.
ఖైరతాబాద్‌లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మంత్రి తలసాని మొక్కలు నాటి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగే పట్టణ ప్రగతిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతామన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి కింద చేపడుతున్న కార్యక్రమాలు మంచి సత్ఫలితాలను ఇస్తున్నాయని స్పష్టం చేశారు. అనేక దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని పేర్కొన్నారు.