అంబర్‌పేట, ఏప్రిల్ 19 : అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్నాయని చెప్పారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని బాగ్ అంబర్‌పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధ్యక్షతన బుధవారం స్థానిక క్రౌన్ ఫంక్షన్హాల్లో జరిగింది. ఈ సమ్మేళనానికి మంత్రి హాజరై మాట్లాడారు. ధరలను పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం మోపిన పాపం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు. నాడు 400 రూపాయలు ఉంటేనే గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టి ఓటేయాలని చెప్పిన ప్రధాని మోదీ 1100 రూపాయలకు పైగా గ్యాస్ ధర ఉందని, ఇప్పుడు ఎవ్వరికి దండం పెట్టాలో చెప్పాలని ప్రశ్నించారు.
అంబర్‌పేటలో గత ఇరవై సంవత్సరాలుగా జరగని అభివృద్ధి కాలేరు వెంకటేశ్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత గడిచిన నాలుగేళ్లలో జరిగిందన్నారు. కులాలు, మతాలతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నదన్నారు. గతంలో 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, నాలుగు సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి అంబర్‌పేటకు, సికింద్రాబాద్ ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సంవత్సరానికి ఎంపీగా తనకు వచ్చే పార్లమెంటు నిధుల నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని తెలిపారు. మీ ఏరియాలో ఎక్కడైనా ఖర్చు పెట్టారా? అంటూ సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించగా, ఎక్కడా లేదని వారు సమాధాన మిచ్చారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన అభివృద్ధి కంటే ఎమ్మెల్యేగా కాలేరు వెంకటేశ్ చేసిన అభివృద్ధి అధికమన్నారు. దీనిపై మహంకాళి ఆలయం వద్ద చర్చకు సిద్ధమా? అని మరోసారి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో పని చేసే వ్యక్తి కాలేరు వెంకటేశ్‌ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని పిలునిచ్చారు. సీఎం కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరూ లేరన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.