అబిడ్స్, ఏప్రిల్ 16 :‘అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. సంక్షేమమే పరమావధిగా..అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న సుభిక్ష తెలంగాణలో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి.. పబ్బం గడుపుకొంటున్న బీజేపీ విష ప్రచారాలను తిప్పికొట్టాలి.. ఆ పార్టీని చిత్తుగా ఓడించాలి. దేశం గర్వించేలా తెలంగాణ ప్రగతి పథంలో పయనిస్తున్నది.. ముచ్చటగా మూడో సారి గులాబీ జెండా ఎగురవేసేలా శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి’ అని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో ముఖ్యనేతలు దిశానిర్దేశం చేశారు. ఆదివారం పలుచోట్ల ఈ కార్యక్రమాలు జరగ్గా.. మంత్రులు తలసాని, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, వివేకానంద్, బేతి సుభాష్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు ఎల్. రమణ, శంభీపూర్ రాజు, సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ బీఆర్ఎస్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్, కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి.. గులాబీని గెలుపుతీరాలకు చేర్చాలని పిలుపునిచ్చారు.
గోషామహల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాటుపడాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. బొగ్గులకుంటలోని రూబీ గార్డెన్స్‌లో గన్‌ఫౌండ్రి డివిజన్ మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన నగర బీఆర్ఎస్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్, గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి నందకిశోర్ వ్యాస్ బిలాల్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం ఇప్పటి నుంచే పాటుపడాలని, బస్తీలలో పాదయాత్రలు చేపట్టి ఇంటింటా సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే అవసరమైన నిధులు విడుదల చేయిస్తానని హామీనిచ్చారు. ఉస్మాన్‌గంజ్ నాలా, చాక్నావాడి నాలా, చేపల మార్కెట్ ఆధునీకరణ వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. ఇక్కడ బీజేపీ నాయకులు చేసిందేమీలేదని విమర్శించారు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే గోషామహల్ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామన్నారు. కరోనా సమయంలో నంద కిశోర్ వ్యాస్ ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారన్నారు. మమతా సంతోష్ గుప్తా ఇంత భారీ ఎత్తున ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.
ముచ్చటగా మూడోసారి…
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని నగర బీఆర్ఎస్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్‌కుమార్ చెప్పారు. గన్‌ఫౌండ్రి డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారన్నారు. ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా పాటుపడితే సాధించలేనిదేమి ఉండదని, అంతా ఏకమై గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేద్దామని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి నందకిశోర్ వ్యాస్ బిలాల్ కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ పుస్తె శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్వి మహేందర్‌కుమార్, నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు మమతా సంతోష్ గుప్తా, ముఖేష్ సింగ్, బీఆర్ఎస్ నాయకులు సంతోష్ గుప్తా, శీలం సరస్వతీ, శ్రీనివాస్ యాదవ్, రాబ్సన్, దిలీప్ గనాతే, ఎస్ ధన్‌రాజ్, ఆల పురుషోత్తం, శాంతిదేవి, నాగరాజు యాదవ్, పి అనిత, జై శంకర్, కోటి శైలేశ్ కురుమ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి ;రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్. రమణ
ఆర్థిక అసమానతలను తొలగించడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్. రమణ స్పష్టం చేశారు. ఆదివారం శంషాబాద్ మున్సిపాలిటీలోని వైఎన్ఆర్ గార్డెన్లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల మనసు గెలుచుకుందని అన్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లోకి పోలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ శంషాబాద్ మున్సిపాలిటీలో వంద కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర నాయకుడు ఆర్ గణేశ్ గుప్త, మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్‌యాదవ్, ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరోసారి బీఆర్ఎస్ సర్కార్ ఖాయం ;బీఆర్ఎస్ నగర ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్
కవాడిగూడ, ఏప్రిల్ 16 : రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని బీఆర్ఎస్ నగర ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి భోలక్‌పూర్‌లోని హెరిటేజ్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం భోలక్‌పూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమ్మేళనానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు అభివృద్ధిని మరిచి బీఆర్ఎస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో జరిగిన అభివృద్ధి వల్లే ప్రజలు మరోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నగర నాయకుడు ముఠా జైసింహ, బీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్, భోలక్‌పూర్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రెబ్బ రామారావు, బింగి నవీన్ కుమార్, మైనార్టీ కమిటీ రాష్ట్ర నాయకులు షరీపోద్దీన్, రహీం, మాజీ కార్పొరేటర్లు టి. రవీందర్, ముఠా పద్మ నరేశ్, భోలక్‌పూర్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు ఉమాకాంత్ ముదిరాజ్, ఆరు డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు నర్సింగ్ ప్రసాద్, ఆర్.మోజెస్, బల్ల శ్రీనివాస్‌రెడ్డి, రాకేష్ కుమార్, శివ ముదిరాజ్, పబ్బకృష్ణ, శంకర్ గౌడ్, జబ్బార్, జునేద్ బాగ్ధాది, మున్వర్ చాంద్, సభీల్ అహ్మద్, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.