హైదరాబాద్ : నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలను త్వరితగతిన అందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మరో 13 GHMC వార్డ్ ఆఫీసులను బుధవారం ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani ) తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం గతంలో వేరు వేరు ప్రాంతాలలో ఉన్న వివిధ శాఖల కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, వార్డ్ ఆఫీసుల ఏర్పాటు తో GHMC పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు వార్డ్ ఆఫీస్ లో అందుబాటులో ఉంటారని అన్నారు.
GHMC పరిధిలోని 150 డివిజన్ లలో ఒక్కో డివిజన్ కు ఒక్కో వార్డు ఆఫీస్ చొప్పున 150 ఆఫీసులను ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఇప్పటికే 137 ఆఫీసులను ప్రారంభించినట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన 13 వార్డ్ ఆఫీసులను మంత్రులు, మేయర్, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభిస్తారని తెలిపారు.
సనత్ నగర్‌లోని రాంగోపాల్ పేట, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని భోలఖ్ పూర్, అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని తిలక్ నగర్లో ఏర్పాటు చేసిన వార్డ్ ఆఫీసులను మంత్రి తలసాని, గోషామహల్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన 3 వార్డ్ ఆఫీసులను హోంమంత్రి మహమూద్ అలీ, ముషీరాబాద్ లోని రాం నగర్లో ఎర్పాటు చేసిన వార్డ్ ఆఫీస్‌ను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రారంభింస్తారు.
అలాగే ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని చింతల్ బస్తీ, నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని మెహదిపట్నంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని విజయ నగర్ కాలనీ, బజార్ ఘాట్ లలో ఏర్పాటు చేసిన ఆఫీసులను MLC ప్రభాకర్ రావు, అహ్మద్ నగర్, సాయిబాబా దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన ఆఫీసులను నాంపల్లి MLA జాఫర్ హుస్సేన్ లు ప్రారంభిస్తారని మంత్రి వివరించారు.