హైదరాబాద్ : ఈ నెల 9 వ తేదీన జరిగే లష్కర్ బోనాలకు పక్కగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలల్లో కలియతిరుగుతూ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆలయాలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బోనాలను ఘనంగా జరుపుకోవాలని ప్రైవేటు ఆలయాలకు కూడా నిధులు అందజేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి తొలిబోనం సమర్పణ ఉంటుందని తెలిపారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.