మారేడ్‌పల్లి, జూలై 2: బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని, బీజేపీ ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు తీసుకొని రావాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనుల విషయంలో ఎన్ని నిధులైనా వెచ్చిస్తుందని, వెనుకడుగు వేయమని పేర్కొన్నారు. ఆదివారం కంటోన్మెంట్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి తలసాని శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా మారేడ్‌పల్లిలో రూ. 26.90 లక్షల వ్యయంతో చేపట్టన్నున సీసీ రోడ్డు పనులు, మోండా మార్కెట్ డివిజన్లోని మనోహర్ థియేటర్ వద్ద రూ. 11.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న వీడీసీసీ రోడ్డు పనులు, మారుతివీధిలో రూ. 39 లక్షల వ్యయంతో స్ట్రామ్ వాటర్ లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… సనత్‌నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రజలు చాలా సంవత్సరాలుగా ఎదుర్కోంటున్న అనేక సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బస్తీ, కాలనీల్లో కోట్ల రూపాయాల నిధులను వెచ్చించి పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. ప్రతిపక్షాలు నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజల సమస్యలు పరిష్కారంకావని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఎన్నో అవార్డులను తెలంగాణ ప్రభుత్వం సాధిస్తుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం పేర్కొన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వంతో పోటీ పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, బేగంపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి, కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ కార్పొరేటర్లు ఆకుల రూప, లాస్యనందిత, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ సీజీఎం ప్రభు, బీఆర్ఎస్ నాయకులు నాగులు, రాములు, జయరాజ్, సంతోష్ యాద వ్, అశోక్, రాము తదితరులు పాల్గొన్నారు.