కందుకూరు/సిటీబ్యూరో, డిసెంబర్ : రంగారెడ్డి జిలా ్లకందుకూరు మండలం బేగరికంచ వద్ద గల ప్యూచర్ సిటీలో ఈ నెల 8,9, తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేసి, ఈ నెల 5వ తేదీలోపు పూర్తి చేయాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి మ్యాప్‌ను పరిశీలించిన అనంతరం అన్ని విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మిట్‌కు వచ్చే అంతర్జాతీయ అతిథులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సదుపాయాలను కల్పించాలని సూచించారు.
ఇంటర్నెట్, రవాణా, తాగునీరు, పారిశుధ్యం, పార్కింగ్, ఎలిప్యాడ్ వంటి వసతులకు అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. అవసరమైన చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పారు. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి, మాజీ జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, సత్తినేని వెంకట్రాంరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, కమిషనర్ శశాంక, అధికారులు వెంకట్‌నర్సింహరెడ్డి, ప్రైమ్రాజ్, అశోక్‌రెడ్డి, చంద్రారెడ్డి పాల్గొన్నారు. మంత్రికి మాజీ జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి శాలువాతో సన్మానించి అనంతరం మండలానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం ఇచ్చారు.
బందోబస్తుపై సీపీ వివరణ
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రాచకొండ సీపీ సుధీర్‌బాబులు ఇతర విభాగాల అధికారులతో కలిసి ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా విభాగాల అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్‌బాబు బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి మంత్రి, చీఫ్ సెక్రటరీలకు వివరించారు.