సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : “గూడు కూల్చొద్దంటూ అధికారుల కాళ్లవేళ్ల పడి బతిమిలాడినా ఆ అభాగ్యుల రోదన వట్టిదేనా? కష్టపడి కట్టుకున్నాం కూల్చొద్దు సారూ అంటూ వేడుకున్న ఓ వృద్ధురాలి కన్నీటి వ్యథలో నిజం లేదా? తమది ఉమ్మడి కుటుంబం..ఈ ఇల్లు ఒక్కటే ఆధారం.. మీరు కూలగొడితే తమ కుటుంబం చెల్లాచెదురవుతుందని చేతులు జోడించిన ఫాతిమా బేగం పడిన ఘోస అబద్ధమా? ఓ వైపు ఇల్లు కూలగొడుతుంటే మరోవైపు ఇటుక ముక్కలు, రాళ్లతో ఇల్లు నిర్మిస్తున్న ఇద్దరు చిన్నారులు చేసిన ప్రయత్నం అంతా అబద్దమా?” మూసీ వెంట ఏండ్ల నుంచి నివాసం ఉంటున్న నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించి.. వారి ఇండ్లను కూల్చివేసిన సర్కార్ ఇప్పుడు మరో రాగం ఎత్తుకుంది.
నిర్వాసితుల ఇండ్లను తాము కూల్చలేదని.. వాళ్లంతట వాళ్లే కూల్చివేసుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రకటించడంపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూసీని ఆనుకుని ఉన్న నాగోల్, రామంతాపూర్, చైతన్యపురి, సైదాబాద్, అంబర్‌పేట తదితర మూసీ ప్రాంతాల్లో మహిళలు తమ ఇండ్లను కూల్చొద్దని చేసిన ర్యాలీలు, నిరసనలు, బతుకమ్మ రూపంలో తెలిపిన ఆందోళనలన్నీ మంత్రికి కనిపించలేదేమోనని విమర్శించారు. “ గుంపు మేస్త్రీ పాలన ఉయ్యాలో గుదిబండ తీరాయే ఉయ్యాలో.. పేదల బతుకుల్లో ఉయ్యాలో.. చీకటి నింపిండు ఉయ్యాలో.. గూడు చెదిరిపాయే ఉయ్యాలో.. గుండెలవిసి పాయే ఉయ్యాలో.. కాంగ్రెస్ రేవంత్ ఉయ్యాలో.. కాలయముడైపాయే ఉయ్యాలో..’ అంటూ పాడుతూ నిరసన వ్యక్తం చేసిన పాటలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సైదాబాద్, మలక్‌పేట్‌లో గల్లీలు చిన్నవి కావడంతో బుల్డోజర్లు, జేసీబీలు వెళ్లలేకపోవడంతో 50 మంది లేబర్లను రంగంలోకి దించి… వాళ్లంతా సుత్తెలు, గడ్డపారలు తదితర సామగ్రిని ఉపయోగించి గోడలను, కప్పులను భూస్థాపితం చేశారు. తమ కండ్ల ముందే ఇండ్లు కూలిపోవడాన్ని చూసిన బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. పోలీసుల పహారాలో ఇండ్లను భూస్థాపితం చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యలపై నిర్వాసితులు, సామాజిక సేవా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.