బడంగ్‌పేట, పహాడీషరీఫ్, జూలై 27: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సమస్యలున్న ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లు, జల్పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మంత్రి అధికారులను అప్రమత్తం చేస్తూ సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు వర్షాల కారణంగా ఇబ్బందులు పడకుండా అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువుల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అలాగే ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పురాతన భవనాలను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.