కందుకూరు, ఏప్రిల్ 1 : హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి కాలం గడపాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని, వారి ఉచ్చులో యువకులు పడవద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. అబద్ధాలు స్పష్టించడంలో బీజేపీ నంబర్ వన్ అని ఎద్దేవా చేశారు. మందిరం, మసీదుల పేరుతో చిచ్చుపెట్టడం తప్ప ఆ పార్టీ వారికి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. శనివారం సామ నర్సింహరెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ నిజమైన హిందువు సీఎం కేసీఆర్ అని చెప్పారు. యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే 2కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెలికితీసి 15లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పిన హామీలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వంతో విసిగిన ప్రజలు దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి అన్నారు. యువకులు బీజేపీ పాలనను గట్టిగా వ్యతిరేకించాలన్నారు.
రేవంత్‌ను నిలదీయాలి ;రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గ్రామాలకు వస్తే నిలదీయాలని రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. పనికట్టుకొని సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని, ఇక మీదట విమర్శిస్తే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం నాయకులు బేర బాలకిషన్, అరవింద్, లక్ష్మీనర్సింహరెడ్డి, ఏజీ అంజయ్యగౌడ్, దశరథ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఆత్మీయ సమ్మేళనాలు..
ముషీరాబాద్: అడిక్‌మెట్ డివిజన్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించనున్నామని, బీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రావణ్‌కుమార్, నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ సునీతా గౌడ్ పాల్గొనున్నట్లు తెలిపారు.
వెంకటేశ్వరకాలనీలో..
బంజారాహిల్స్: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వెంకటేశ్వరకాలనీ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం బంజారాభవన్‌లో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి కార్యక్రమం ఉంటుందన్నారు.