బడంగ్‌పేట, ఏప్రిల్2 : ప్రజలను మోసం చేయడం బీజేపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ అడివిరెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు అల్మాస్గౌడ అంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, వైస్ఆర్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహేశ్వరం నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని మండి పడ్డారు. చెరువులను సుందరీకరణ చేస్తుంటే కబ్జాలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేయడం మచి పద్ధతి కాదని హితవు పలికారు. కోమటి కుంటను రూ.2.50కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి కష్ట నష్టాలకోర్చి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అల్మాస్‌గూడలో ఉన్న గ్రీన్ జోన్ తొలగించడానికి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుక పోతానని ఆమె పేర్కొన్నారు. పనిచేసిన వారిని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు బలపర్చాలన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయచితం శ్రీధర్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ విజన్‌తో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజక వర్గం బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిమ్మల నరేందర్ గౌడ్, కార్పొరేటర్లు రామిడి కవితా రాంరెడ్డి, సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, ముత్యాల లలితా కృష్ణ, ఏనుగు రాంరెడ్డి, బోయపల్లి దీపికా శేఖర్ రెడ్డి, సూర్ణ గంటి అర్జున్, చప్పిడి సంతోష్ రెడ్డి, కుంచ నాగేందర్, వాణి, శ్రీపాల్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి, యాదగిరి ఉన్నారు