బంజారాహిల్స్, మే 3 : బంజారాహిల్స్ రోడ్ నెం-12లోని ఎమ్మెల్యే కాలనీని అనుకుని ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగిస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. షేక్‌పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం 12లో కబ్జాదారుల నుంచి కాపాడిన 12 ఎకరాల స్థలాన్ని శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నో ఏళ్లుగా అనేక రకాలైన వివాదాలు సృష్టించి ఎమ్మెల్యే కాలనీ పక్కనున్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయని, స్థానిక తహసీల్దార్ అనితారెడ్డితో పాటు జిల్లా యంత్రాంగం సమన్వయంతో స్థలాన్ని కాపాడడంతో పాటు ఫెన్సింగ్ వేయించడం అభినందనీయమన్నారు. ఈ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడేలా వినియోగిస్తామని తెలిపారు.