సిటీ బ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): ‘సిటీలో ఎలాంటి నీటి సమస్య లేదు.. అయినప్పటికీ నగరంలోని బస్తీలు, కాలనీల ప్రజలు ఉద్దేశపూర్వకంగానే రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు.. కొంతమంది కావాలనే జలమండలి కార్యాలయాలను ముట్టడిస్తూ రాజకీయం చేస్తున్నారు…’ ఇవి హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు. జలమండలి ప్రధాన కార్యాలయంలో మంగళవారం సమ్మర్, మాన్సూన్ యాక్షన్ ప్లాన్‌పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ… నగరంలో ఎక్కడా నీటి సమస్యలేకున్నా కొంతమంది కావాలని నిరసనలు చేస్తున్నారని అన్నారు.
అయితే నగరవ్యాప్తంగా నిత్యం అనేక ప్రాంతాల్లో ప్రజలు బిందెలు పట్టుకుని రోడ్డెక్కుతుంటే మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నది. రోజుల తరబడిగా నీళ్లు రాకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతుంటే సమస్యను పరిష్కరించాల్సింది పోయి అసలు సమస్యే లేదనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో బస్తీలు, కాలనీలకు వచ్చి చూస్తే సమస్య తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జలమండలి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా బస్తీలకు నీళ్లివ్వడంలేదని రోజుల తరబడి చేస్తున్న నిరసనలు మంత్రికి కనిపించడం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నీటి సమస్యలకు రాజకీయ రంగు
నగరంలోని మెజార్టీ ప్రాంతాల ప్రజలు నీటి సరఫరాలో అంతరాయం, కలుషిత నీరు, లోప్రెషర్ వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారుల పట్టించుకోకపోవడంతో తప్పని పరిస్థితుల్లో బిందెలతో రోడ్డెక్కుతున్నారు. సమస్య పరిష్కరించాల్సిన మంత్రి మాత్రం ప్రజలకు ఎలాంటి సమస్యలేదు.. అదంతా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారనడం విస్తుగొలిపిస్తున్నది. ప్రజల సమస్యలకు రాజకీయ రంగు పులిమి.. నిరసనలు చేసేవారు బాధితులు కారని.. వారంతా రాజకీయ నాయకులని అనడం కలచివేస్తున్నది. బాధ్యత గల మంత్రి హోదాలో ఉండి ప్రజల సమస్యలకు రాజకీయాలు ఆపాదించడం సరికాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.