కవాడిగూడ/హిమాయత్‌నగర్ మార్చి 4: విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన ముషీరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 57 లక్షలతో అభివృద్ధి పనులు, అలాగే సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్(ఎస్ఆర్డీ) సంస్థ సహకారంతో డాక్టర్ విజయ్ కుమార్ దాట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ముషీరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్ఎసీ)ని , హిమాయత్‌నగర్ డివిజన్లోని దత్తానగర్‌లో బస్తీ దవాఖానను ప్రారంభించారు.
ఆయా కార్యక్రమాల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, కార్పొరేటర్లు గౌసొద్దీన్, మహాలక్ష్మిరామన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.