హిమాయత్‌నగర్, ఫిబ్రవరి 4: రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉదయ్‌పూర్‌లోని నారాయణ్ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఆదివారం కింగ్‌కోఠిలోని ఈడెన్ గార్డెన్లో ఉచితంగా స్క్రీనింగ్, డయాగ్నసిస్, ఆర్టిఫిషియల్ లింబ్, కాలిఫర్స్, కొలతల శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నారాయణ్ సేవా సంస్థ ఉచితంగా కృతిమ అవయవాలను అందించడం అభినందనీయమన్నారు.
సుమారు 1500మంది దివ్యాంగులు ఈ శిబిరానికి హాజరుకాగా, 150 మందికి ఆపరేషన్, 850 మందికి కృతిమ అవయవాల కోసం కొలతలు తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సతీమణి నందిని, నారాయణ్ సేవా సంస్థాన్ డైరెక్టర్ దేవేంద్ర చౌబిసా, కో-ఆర్డినేటర్ అల్కా చౌదరి, ప్రతినిధులు జస్మిత్ పటేల్, భగవాన్ ప్రసాద్ గౌర్, రితేశ్ జగీర్దార్, ప్రశాంత్ అగర్వాల్, నరేంద్రసింగ్ చౌహాన్, ఉత్తమ్ దమ్రాణి అభయ్ చౌదరి, హరిప్రసాద్, రాకేశ్ శర్మ, ఐశ్వరీ త్రివేది, శశిగాంధీ పాల్గొన్నారు.