సిటీ బ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష ధోరణి అవలంభిస్తున్నది. సమావేశాలు, సమీక్షలకు గ్రేటర్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అరకొర సమాచారం ఇస్తూ.. వారిని హాజరు కాకుండా చేస్తున్నారు. సమావేశాలకు వారిని రానిస్తే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతారనే అక్కసుతో అధికారికంగా ఆహ్వానాలు అందించడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి.
జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన వినాయక చవితి సన్నాహాక సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ముందస్తు ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించాల్సి ఉంటుంది. కానీ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాలేదు. ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ చెందిన వారు కావడంతో ముందస్తు ఏర్పాట్లు, గతేడాది వైఫల్యాలను సమీక్షలో ఎండగడతారనే అరకొర సమాచారం ఇచ్చారని విమర్శలు తలెత్తుతున్నాయి.
ప్రతిపక్ష నేతలు హాజరైనా కాకున్నా ప్రొటోకాల్ ప్రకారం పూర్తి సమాచారం చేరవేసి, ఆహ్వానం అందించాల్సి ఉన్నా అలాంటిదేమీ జరగకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశ్వనగరంలో పాతాలానికి పడిపోయిన శాంతి భద్రతలు, పాలన తీరును ఎత్తిచూపుతారనే భయంతోనే ఏక పక్షంగా నిర్వహించారని ఆరోపిస్తున్నారు. ఇటీవల విద్యుదాఘాతంతో జరిగిన వరుస మరణాలు, వరుస దొంగతనాలపై ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తారనే మంత్రి మాత్రమే పాల్గొని మమా అనిపించారని ఎద్దేవా చేస్తున్నారు.
సమీక్ష సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మనును వేదిక మీద సీట్లు కేటాయించలేదు. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులందరి ముందు కలెక్టర్లను అవమానించారు. జిల్లా మెజిస్ట్రేట్ స్థానంలో ఉన్న ఐఏఎస్ అధికారులకు కనీస విలువ ఇవ్వకుండా కింది స్థాయి అధికారుల స్థానాల్లో సీట్లను కేటాయించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్‌తో పాటు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలు మాత్రమే సమీక్ష కోసం ఏర్పాటు చేసిన వేదికపైన కూర్చుకున్నారు.
మిగిలిన శాఖల ఉన్నతాధికారులతో పాటు ముగ్గురు కలెక్టర్లను కూడా వేదిక కిందనే ఉంచారు. సమీక్షలో భాగంగా వారి వివరణలను కూడా వేదిక కిందనే ఉంచి తీసుకున్నారు. చేసేదేమీ లేక కలెక్టర్లు వేదిక కింద నుంచే వారి వివరణలను ఇచ్చారు. కానీ కొంతమంది అధికారులను వేదికపైకి పిలిచి మరీ శాఖాపరమైన విధివిధానాలను వివరించాలని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్లను మాత్రం కిందనే ఉంచారు. ముగ్గురు కలెక్టర్ల వివరణలను వేదిక కింది నుంచే తీసుకోవడంతో అక్కడున్న వివిధ శాఖల అధికారులు ముక్కున వేలేసుకున్నారు.