సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : నగరానికి కృష్ణా జలాల సరఫరాలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వేసవిలోనూ నిరంతరాయంగా నీటి సరఫరా అందిస్తామని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో తాగునీటికి కటకట అంటూ వచ్చిన ‘నమస్తే తెలంగాణ’ కథనంపై మంత్రి పొన్నం స్పందించారు. ప్రస్తుతం కృష్ణ తాగునీటి సరఫరా వ్యవస్థపై ఎలాంటి భయందోళనలు అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో 33.62 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని, భవిష్యత్తులో జలమండలికి నెలకు 1.40 టీఎంసీల చొప్పున 10 టీఎంసీల నీరు వినియోగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం సాగర్లో 520.8 అడుగుల నీటిమట్టం ఉందని, నీటి నిల్వలు 510 అడుగుల మేర కొనసాగించాలని ఇప్పటికే ఇరిగేషన్ ఈఎన్సీకి లేఖ రాశామని, ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో పరిస్థితిని సమీక్షిస్తున్నామని వెల్లడించారు. 2017 సంవత్సరంలో చేసిన మాదిరిగానే ఈ సారి అత్యవసర పంపింగ్ కోసం టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కృష్ణా మూడు దశల్లో 270 ఎంజీడీల నీరు అందిస్తామని, కృష్ణా జలాల తరలింపులో ఎలాంటి భయాందోళన అక్కర్లేదని జలమండలి అధికారులు స్పష్టం చేశారు.